
తెలుగు సినిమా 24 శాఖలకు చెందిన ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అమ్మి రాజు కాసుమల్లి విజయం సాధించారు. ఆదివారం జరిగిన కార్యదర్శి ఎన్నికల్లో అమ్మిరాజు 35 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇంతకు ముందు ఈ పదవిలో దొరై ఉండేవారు. ఇటీవలే జరిగిన మేనేజర్స్ ఎన్నికల్లో దొరై ఓటమిపాలయ్యారు. నిబంధల ప్రకారం ఆయన ఫెడరేషన్ పోస్ట్‌కు అనర్హుడు కావడంతో ఈ పోస్ట్‌కు ఎన్నికలు అనివార్యమయ్యాయని కమిటీ పేర్కొన్నది. ఫెడరేషన్ అధ్యక్షునిగా అనిల్ వల్లభనేని, కోశాధికారిగా సురేశ్ ఇప్పటికే బాధ్యతల్లో ఉండగా, ఇప్పుడు కార్యదర్శిగా అమ్మిరాజు బాధ్యతను స్వీకరించారు. అమ్మిరాజు కార్యదర్శిగా ఎంపిక కావడంపట్ల ఫెడరేషన్ సంతోషం వెలిబుచ్చింది. కార్యదర్శిగా తనను ఎన్నుకున్న సభ్యులకు అమ్మిరాజు కృతజ్ఞతలు తెలిపారు.
