తెలంగాణకు మరో శాశ్వతకీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్‌కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగసుందరంగా, శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. తమిళనాడుకు చెందిన 70మంది అధికారుల బృందం గతంలో దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడి కలప కళాకృతులను పరిశీలించింది. అదే బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని రెండు రోజులపాటు నిశితంగా పరిశీలించింది. ఆలయంలోని కలప కళాకృతులు వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. వాటి గురించి ఆరా తీస్తే అవి హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నట్టు తేలింది. వెంటనే టింబర్ డిపోను సందర్శించి నిరుడు మే నెలలో ఆలయ ద్వారాలు, తలుపులకు సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు.జనవరి 22న అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ నగరం నుంచి ఆలయ ద్వారాలు వెళ్లనుండడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.