కొత్తవాళ్లను వెండితెరకు పరిచయం చేయడంలో నాకు మంచి పేరుంది. అందులో నాకు సంతృప్తి కూడా ఉంది. అందుకే విరామం తర్వాత మేం చేస్తున్న చిత్రాన్ని కొత్తవాళ్లతో చేయాలనుకున్నాం. అందులో భాగంగా నే న్యూ టాలెంట్ రోర్స్ అనే బ్యానర్‌ని స్థాపించాం. ఈ సంస్థకు నిర్మాతగా నా భార్య యలమంచిలి గీత వ్యవహరిస్తారు. మేం నిర్మించనున్న సినిమాకు సంబంధించి న్యూ టాలెంట్‌కోసం వెతుకుతున్నప్పుడు టి.ప్రసన్నకుమార్‌గారు ఓ కుర్రాడ్ని చూపించారు. తనెవరోకాదు, స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి ముని మనవడు, స్వర్గీయ నందమూరి హరికృష్ణగారి మనవడు. స్వర్గీయ నందమూరి జానకిరామ్‌గారి తనయుడు నందమూరి తారకరామారావు అని తెలిపారు దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి.
తన తాజా ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం మాట్లాడుతూ తనకు కొడుకు పుట్టినప్పుడే ఓ కల కని ఎన్టీఆర్ అనే పేరును కొడుక్కి పెట్టుకున్నారు జానకిరామ్. దానికి తగ్గట్టే ఆ కుర్రాడు కూడా అందగాడు, చక్కని వాచకం, మంచి నడవడిక. తండ్రి కల సాకారం చేయాలనే తపన కూడా అతనిలో ఉంది. అతడ్ని చూసినప్పుడు అన్నగారి నాలుగో తరాన్ని కొనసాగించే కెపాసిటీ అతనికి ఉందని అనిపిం చింది. ఏదేమైనా అన్నగారి నాలుగోతరాన్ని తెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కడం అదృష్టం గా భావిస్తున్నాను. మరో సమావేశంలో అతని రూపాన్ని రివీల్ చేస్తాం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు వైవీఎస్. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేశ్ అత్తిలి.