Namaste NRI

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం …సీనియర్ నటి కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి వాసవి అలియాస్ పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆమె మరణవార్తతో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరాటే కళ్యాణి తన ఫేస్‌బుక్ పోస్టులో పద్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నిన్ను కాపాడాలని ఎంతో ప్రయత్నించాను. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అంటూ ఆమె పేర్కొన్నారు.

1978లో విజయనగరంలో జన్మించిన వాసవి, జయ వాహిని పేరుతో టెలివిజన్ మరియు సినీ రంగాల్లో మంచి గుర్తింపు సంపాదించారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె నటన ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 2019లో విడుదలైన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో వీకే నరేష్ సరసన నటించిన ఆమె, చివరిసారిగా బహిర్భూమి సినిమాలో కనిపించారు. ఆమె మృతికి సినీ ప్రముఖులు, అభిమానులు ప‌లువురు సంతాపం తెలుపుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events