టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. ఆయన కెరీర్‌లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారు. బాలనటుడిగానే 150 చిత్రాల్లో నటించడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోలతో ఆయన నటించారు. ఆమె కథ, ముఠా మేస్త్రీ, బిగ్‌బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ వంటి చిత్రాలతో ఆయన గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు.
విశ్వేశ్వరరావు ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా రన్ చేస్తున్నారు. విస్సు టాకీష్ పేరుతో నడిపిస్తున్న ఆ యూట్యూబ్ ఛానల్‌లో సినిమాల కు సంబంధించిన పలు విషయాలను ఆయన పంచుకున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితతో తాను పనిచేశానని, ఇది తనకెంతో గర్వకారణమని ఆయన చెప్పుకునేవారు. ఆయన పార్థివ దేహాన్ని చెన్నై సమీపంలోని సిరుశేరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. బుధవారం నాడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విశ్వేశ్వరరావు మరణవార్తతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.