భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అయోధ్య రామయ్య కరుణించలేదు. దశాబ్దాలుగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ అంశం బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలిగించలేదు. మందిర నిర్మాణం తమకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందని బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. నిజానికి, రామ మందిర నిర్మాణం మొత్తం పూర్తి కాకముందే ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి.దేశమంతా హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు మందిర నిర్మాణాన్ని ఎన్నికల ప్రచార అంశంగా మార్చుకుంది.
అయితే, దేశవ్యాప్తంగా బీజేపీ సీట్లు తగ్గిపోవడం చూస్తే రామమందిర నిర్మాణం ద్వారా బీజేపీ ఆశించిన రాజకీయ ప్రయోజనం ఆ పార్టీకి దక్కనట్టు స్పష్టమవుతున్నది. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. ఆఖరికి రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి పాలయ్యింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ విజయం సాధించారు.