అమెరికాలో అట్లాంటా బ్యాడ్మింటన్ ఓపెన్ 2025 ను ఘనంగా నిర్వహించారు. అట్లాంటాలోని ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 14, 15, 16 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో స్ఫూర్తిని కలిగించారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై తన అనుభవాలను పంచుకున్నారు. వందలాది అభిమానులు ఆటగాళ్లలో ఫొటోలు దిగారు. పలువురు చిన్నారుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. పీవీ సింధు రాకతో ప్రాంగణంలోని వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యత్వం తీసుకున్న సింధు, వచ్చే ఏడాది అట్లాంటా వచ్చినపుడు ఇక్కడి బ్యాడ్మింటన్ ఫ్లేయర్లకు శిక్షణ ఇస్తానని ప్రకటించారు.

ఈ భారీ క్రీడా ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది క్రీడాకారులు హాజరయ్యారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అన్ని వయసుల ఆటగాళ్లు దీనికి హాజరయ్యారు. అమెరికాలో అతిపెద్ద బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌గా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ మేనేజ్‌మెంట్ సభ్యులు మాట్లాడుతూ యువ ప్రతిభను వెలికితీయడం, వారికి అంతర్జాతీయ స్థాయి వేదిక ఇవ్వడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. క్రీడా ప్రేమికులకు చిరస్మరణీయమైన టోర్నమెంట్ అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు.


ఈ టోర్నమెంట్ ప్రత్యేకతలు : మొత్తం మ్యాచ్‌లు 550+, పాల్గొన్న క్రీడాకారులు : 460+, క్లబ్‌లు: 100+, విభాగాలు: 40+, బహుమతులు 25కే+ కోర్టులు :22



















