హెచ్-1బీ వీసా నిబంధనల్లో అమెరికా భారీ మార్పులు చేసింది. తద్వారా అమెరికన్ కంపెనీలు మరింత తేలిగ్గా విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాకుండా ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులువుగా హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.కొత్త నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. సమర్థులైన విదేశీ ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు స్పష్టమవుతున్నది. వీటితో అమెరికాలోని లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు మరింత లబ్ధి చేకూరుతుంది. అగ్రరాజ్యంలో మంచి వేతనాలు లభించే కీలక ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తమ ఉద్యోగ స్థితి ఆధారంగా అమెరికాలో ఉండేందుకు అనుమతి లభిస్తుంది.