సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఆరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంత ర బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అల్లు అర్జున్‌కు నిరాకరించలేమని, ఆయనకు జీవించే హక్కు ఉన్నదని కోర్టు పేర్కొన్నది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉన్నదని, అంతమాత్రాన కేసును ఒక్కరిపైనే రుద్దలేమని కోర్టు వ్యాఖ్యానించింది. అర్నాబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పును ఆధారంగా తీసుకుని ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు.
రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని, కేసులో విచారణకు సహకరించాలని మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు అల్లు అర్జున్‌కు సూచించింది. విచారణలో జోక్యం చేసుకోవ ద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నది. జైలు సూపరింటెండెంట్‌కు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల విషయం తెలుపాలని ఈ సందర్భంగా అల్లు అర్జున్ లాయర్ కోరగా, తాము ఆదేశాలు పంపిస్తామని న్యాయమూర్తి చెప్పారు.