సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం.. దాన్ని కొనసాగిస్తూ.. రక్తదానం మహాదానమని, రక్తదానం పై అందరూ అవగాహన పెంచుకోవాలని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం, సత్యసాయి గ్లోబల్ ఆర్గనైజేషన్ సింగపూర్, సెంపగ వినాయగర్ టెంపుల్, సింగపూర్ సిలోన్ తమిళ్ అసోసియేషన్, మునీశ్వరన్ కమ్యూనిటీ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఎంతో మంది దాతలకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, స్థానిక ప్రజల నుంచి అద్భుతమైన స్పందన రావడం అభినందనీయమని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుందన్నారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలని నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించిందని కొనియాడారు. 120 మంది రక్తదానం చేసి విజయవంతం చేశారని నిర్వాహకులు పాలెపు మల్లిక్ వెల్లడించారు. ఈ శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్ధన రావు , జ్యోతీశ్వర్ రెడ్డి , సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది కూడా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.