పాతికేళ్లుగా అంతరిక్షంలో వ్యోమగాములకు ఆవాసంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్‌ఎస్) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విచ్ఛిన్నం చేయబోతున్నది. 2030 నాటికి ఈ పని పూర్తి చేయడాని కి ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇందుకు గానూ అంతరిక్ష కేంద్రాన్ని తిరిగి భూమికి తీసుకువచ్చేందు కు ఒక భారీ వ్యోమనౌక(డీఆర్బిట్ వెహికిల్)ను తయారుచేసే బాధ్యతను ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కు అప్పగించింది. ఇప్పటికే ఇందుకోసం స్పేస్‌ఎక్స్‌కు నాసా రూ.7 వేల కోట్లు చెల్లించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. ఈ వాహనం భూఉపరితలానికి 250 మైళ్ల ఎత్తులో(దాదాపు 400 కిలోమీటర్లు) ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని భూవాతావరణంలోకి లాక్కొస్తుంది. భూవాతావరణంలోకి రాగానే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అంతరిక్ష కేంద్రం దహనమైపోతుంది.