Namaste NRI

కెప్టెన్‌ విజయకాంత్‌ ఇకలేరు

తమిళ సినీనటుడు, దేసియ ముర్పొక్కు ద్రవిడ కజగం (డీఎండీకె) రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు మాజీ శాసనసభ్యుడు విజయకాంత్‌(71) చెన్నయ్‌లో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల దృష్ట్యా గత నెలలో ఆయనను చెన్నయ్‌ మనప్పాకంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. నెలరోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్న విజయ్‌కాంత్‌ కన్నుమూశారు. తమిళనాట అగ్ర కథానాయకుడిగా పేరు పొందిన విజయ్‌కాంత్‌ 150కిపైగా చిత్రాల్లో నటించారు. అందులో ఇరవైకి పైగా చిత్రాల్లో పోలీస్‌ అధికారిగా ప్రేక్షకుల్ని మెప్పించారు.

విజయ్‌కాంత్‌ 1952 ఆగస్ట్‌ 25న తమిళనాడులో మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. విజయ్‌కాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. 27 ఏండ్ల వయసు లో విజయకాంత్‌ తెరంగేట్రం చేశారు.ఇనిక్కుమ్‌ ఇలమై(1979) చిత్రంలో నటుడిగా పరిచయమైన ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలతో తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన్ను అభిమానులు పురచ్చి కలింజర్‌ (విప్లవ కళాకారుడు) అని ప్రేమతో పిలుచుకునేవారు. కెప్టెన్‌ ప్రభాకరన్‌ సినిమా నుంచి ఆయన్ను అభిమాను లు కెప్టెన్‌అని అభిమానంతో పిలుచుకునేవారు. తమిళంలో దాదాపు 150 పైచిలుకు చిత్రాల్లో నటించిన విజయకాంత్‌ని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో అభిమానిస్తారు.

ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై అఖండ విజయాలు చవిచూశాయి. విజయకాంత్‌ హీరోగా, సత్యరాజ్‌ విలన్‌గా తమిళంలో రూపొందిన నూరవత్తునాళ్‌ చిత్రం నూరవరోజు పేరుతో తెలుగులో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే ఆయన తమిళంలో నటించిన సింధూర పువ్వే కూడా సింధూరపువ్వుగా తెలుగులో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. తెలుగులో విజయ్‌కాంత్‌కి స్టార్‌డమ్‌ తెచ్చిన సినిమా పోలీస్‌ అధికారి. ఈ సినిమాతో తెలుగులో కూడా ఆయనకు మార్కెట్‌ గణనీయంగా పెరిగింది. కమల్‌హాసన్‌ తర్వాత తెలుగులో అధిక మార్కెట్‌ గల హీరోగా విజయ్‌కాంత్‌ ఎదిగారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events