సౌర విద్యుదుత్పత్తి రంగంలో చైనా మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నది. 400 కిలోమీటర్ల పొడవుతో భారీ సౌర విద్యుత్తు ఫలకాలను ఏర్పాటు చేస్తున్నది. ఇన్నర్ మంగోలియాలో సీ ఆఫ్ డెత్ గా ప్రాచుర్యం పొందిన కుబుకి ఎడారిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును సోలార్ గ్రేట్ వాల్ అని పిలుస్తున్నారు. 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఐదు కిలోమీటర్ల వెడల్పు, 400 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది.
ఇప్పటికే 5.4 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి సరిపడా సౌర ఫలకాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. రాజధాని బీజింగ్‌కు విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో చైనా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. 2030 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నది. నాసాకు చెందిన ఓఎల్‌ఐ, ఓఎల్‌ఐ-2 ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి తీసిన చిత్రాల్లో ఈ కొత్త సౌర విద్యుత్తు ప్రాజెక్టు స్పష్టంగా కనిపిస్తున్నది.