తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ప్రధానంగా స్కిల్ డెవెలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలు చేసి తీరుతామని ప్రకటించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి పాల్గొన్నారు.