అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా పేరు పొందిన ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికా లోని రాజకీయ ప్రముఖులు, ఇండియాలో ఉన్న రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు, ఇతరులు మహాసభలకు వచ్చి కనువిందు చేస్తుంటారు. ఈసారి తానా 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. ఈ మహాసభలకోసం ఏర్పాటుచేసిన వివిధ కమిటీలతో డిట్రాయిట్ లోని శ్రీ వేంకటేశ్వర టెంపుల్ ఆవరణలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు తానా మహాసభలకు అవసరమైన ప్రణాళికలు, ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.


ఈ సందర్భంగా తానా మహాసభల ప్రత్యేక సావనీర్ కోసం కమిటీ సభ్యుల ఫోటో సెషన్స్‌ను కూడా నిర్వహించారు.ఈ కమిటీ సమావేశానికి మైత్రీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత నవీన్ ఎర్నేని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ, తానా మహాసభల విజయవంతానికి తనవంతుగా సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా యూత్ కమిటీ నాయకులు మాట్లాడుతూ, తామంతా సినిమాల్లో చూపిస్తున్న తెలుగు సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నామని, మీరు తీసే సినిమాల రిలీజ్ ఫంక్షన్ యూత్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించాలని అభ్యర్థించారు.


కమిటీ సభ్యుల ఉత్సాహం చూస్తే ఆనందంగా ఉందని కాన్ఫరెన్స్ సమన్వయకర్త ఉదయ్ కుమార్ చాపలమడుగు అన్నారు. మహాసభలు విజయవంతానికి అందరూ కృషి చేయాలని కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్ కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులతోపాటు ఇతర తానా కాన్ఫరెన్స్ నాయకులు పలువురు పాల్గొన్నారు.

