Namaste NRI

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత..ధర్మపురి శ్రీనివాస్ ఇక లేరు 

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2004, 2009లో మంత్రిగా సేవలందించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంతా ఆయనను డీఎస్‌ అని పిలిచేవారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లోనే ఉంచారు. సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి పార్థీవదేహాన్ని తరలించనున్నారు.

1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌లో జన్మించిన డీఎస్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. తొలిసారిగా 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన ఆయన, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో గెలుపొందారు. అనంతరం 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్‌ఎస్‌తో పోత్తు కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు.

2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా సేవలందించారు. తెలంగాణ ఆవిర్భావంత తర్వాత మండలి విపక్ష నేతగా పనిచేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో 2015లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే బీఆర్‌ఎస్‌తో విభేదించిన ఆయన తన పదవీ కాలం ముగిసే వరకు పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామాచేసి సొంతగూటికి చేరారు. అయితే మరోవైపు అనారోగ్య సమస్యలతో డీఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. చిన్న కుమారుడు అర్వింద్‌  ప్రస్తుతం నిజామాబాద్‌ ఎంపీగా కొనసాగుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress