అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. అది కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న అధికారులకు వైరస్ సోకడం గమనార్హం. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి ఒక ప్రకటన విడుదల చేశారు. వైట్‌హౌస్ కింది స్థాయి అధికారులలో కొంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ 19 బారిన పడ్డ అధికారులకు కేవలం చిన్నపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. అయితే, ఎంతమంది అధికారులకు పాజిటివ్‌గా వచ్చింది మాత్రం చెప్పలేదు. అలాగే వారికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని కూడా బయటపెట్టలేదు. కాగా వైరస్ సోకిన అధికారులు అటు అధ్యక్షుడు బైడెన్‌తో గాని, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో గానీ కాంటాక్ట్‌లో లేరని సాకి వివరించింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వీరితో కాంటాక్ట్ అయిన వారిని కూడా గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.