కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( క్రెడాయ్) ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు రానుంది. క్రెడాయ్ 11వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో వచ్చే ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. మూడు రోజుల ప్రదర్శన లేఅవుట్‌ను క్రెడాయ్ ప్రతినిధులు విడుదల చేశారు. మూడు రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో టీఎస్ రెరా ఆమోదించిన ప్రాపర్టీలు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని అధ్యక్షుడు రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ.రాజశేఖర్ రెడ్డిలు తెలిపారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి 110 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని, వీటిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లకు సంబంధించి ప్రాజెక్టులను ప్రదర్శించనున్నామని తెలిపారు. సమీప భవిష్యత్తులో నగరంలో మూడు డాటా సెంటర్లు రానున్నాయని, వీటితో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రెసిడెంట్లు జి.ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ రావు, ట్రెజరర్ ఆదిత్యా గౌర, జాయింట్ సెక్రటరీలు కే రాంబాబు, శివరాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)