పొరుగు దేశం నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ నేపాల్‌లోని మదన్ -ఆష్రిత్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. నేపాల్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము న మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై 66 మంది టూరిస్ట్‌లతో వెళ్తున్న రెండు బస్సులపై ఒక్కసారిగా కొండ చరియలు విరగిపడ్డాయి. దీంతో బస్సులు త్రిశూలి నదిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో రెండు బస్సుల్లోని ప్రయాణికులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు భారతీయులు మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం నదిలో గల్లంతైన వారి కోసం అధికారులు విస్త్రృతంగా గాలిస్తున్నారు. వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. దీనికితోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు.