ప్రముఖ హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన ఏజెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ అనే పాత్రను పోషించారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు థియోడెన్‌గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
కెరీర్ ప్రారంభంలో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రం బ్లాక్‌స్టఫ్ ఆయనకు గుర్తింపును తీసుకువచ్చింది. 1982 నాటి బ్రిటీష్ టీవీ మినీ సిరీస్ క్లాసిక్‌గా నిలిచింది. అలాగే, పలు వార్డులు సైతం తెచ్చిపెట్టింది. తాజాగా, ఆయన మోర్గన్ ఫ్రీమెన్‌తో కలిసి బీబీసీలో మరో టెలివిజన్ సిరీస్‌లో నటించారు. ‘ది రెస్పాండర్’ సెకండ్ సిరీస్ ప్రారంభమైన రోజునే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సీరిస్‌లో షో స్టార్ మార్టిన్ ఫ్రీమాన్ తండ్రిగా నటించాడు. ఆయన మృతికి పలువురు నివాళులర్పించారు.