Namaste NRI

బెంగాల్‌లో దీదీ దూకుడు.. బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ పశ్చిమబెంగాల్‌లో జోరు కనబరిచింది. బెంగాల్‌లో భారీగా సీట్లు సాధించాలన్న బీజేపీ ఆశలకు మమత గండికొట్టారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ టీఎంసీ దూసుకెళ్లింది. హోరాహోరీగా జరిగిన పోరులో టీఎంసీ తన పట్టును నిలుపుకొంది. రాష్ట్రంలో మొత్తం 42 ఎంపీ స్థానాలుండగా 29 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకకున్నది. పశ్చిమబెంగాల్‌పై భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ 12 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్‌ ఒకేఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నది.

ఇండియా కూటమికి దూరంగా ఉన్న టీఎంసీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగి సత్తా చాటింది. బీజేపీని దీటుగా ఎదుర్కొంది. ఆ పార్టీ ముఖ్య నేతలు అభిషేక్‌ బెనర్జీ, మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్‌, శతృఘ్నసిన్హా , క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ గెలుపు తీరాలకు చేరారు. అభిషేక్‌ బెనర్జీ 7 లక్షలకు పైగా మెజారిటీ సాధించడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో 2019 నాటి మ్యాజిక్‌ను రిపీట్‌ చేయడంలో బీజేపీ విఫలమైంది. గత ఆ పార్టీ 18 స్థానాల్లో గెలుపొందగా,  ఈ సారి 12 స్థానాలతోనే సరిపెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్‌ తీవ్రంగా నిరాశపరిచింది. ఆ పార్టీ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదురీ, క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, ఓట్ల శాతంలోనూ టీఎంసీ దూకుడు ప్రదర్శించింది. అధికార టీఎంసీ 47 శాతానికి పైగా ఓట్లను దక్కించుకోగా, బీజేపీ 37 శాతం, కాంగ్రెస్‌ 4 శాతం ఓట్లు దక్కించుకున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events