ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించింది. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ ఎంబసి డిప్యూటీ చీఫ్ జార్జ్ ఎంజ్వీలర్‌ను విదేశాంగ శాఖ పిలిపించింది. ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడమేనంటూ తీవ్రంగా స్పందించింది. జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై మండిపడింది. జర్మనీ చేసిన వ్యాఖ్యలను భారత న్యాయవ్యవస్థ స్వాతంత్య్రానికి భంగం కలిగించేలా చూస్తున్నామని చెప్పింది.
భారతదేశం పటిష్టమైన శాంతిభద్రతలను కలిగి ఉన్న దేశమని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు భారత్‌కు వర్తిస్తాయని జర్మనీ పేర్కొంది. అందరిలానే నిష్పక్షపాత, న్యాయబద్ద విచారణకు కేజ్రీవాల్ అర్హుడని, అరెస్టు చేయకుండా ఆయనను విచారించవచ్చని, దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్‌కు వర్తిస్తుందని జర్మనీ ఢిల్లీ సీఎం అరెస్టుపై ప్రకటన విడుదల చేసింది. దీనిపై భారత ఆగ్రహం వ్యక్తం చేసింది.