అమెరికాకు బాల్యంలో తల్లిదండ్రులతోపాటు వలస వెళ్లిన వారికి శుభవార్త. సవరించిన డ్రీమ్ యాక్ట్, 2025ని సెనేటర్లు డిక్ డర్బిన్ (డెమొక్రాట్-ఇలినాయిస్), లీసా ముర్కోవ్‌స్కీ (రిపబ్లికన్-అలాస్కా) అమెరికన్ సెనేట్‌లో ప్రతిపాదించారు. హెచ్-1బీ, ఎల్-1, ఈ-1 వంటి లాంగ్ టెర్మ్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్ల పిల్లలను కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలని వీరు ప్రతిపాదించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇటువంటి పిల్లలు తమకు 21 సంవత్సరాల వయసు నిండటంతో, తమకు గల డిపెండెంట్ హోదాను కోల్పోతారు. ఫలితంగా, తప్పనిసరి పరిస్థితుల్లో స్టూడెంట్ వీసాకు మారవలసి ఉంటుంది లేదా అమెరికాను విడిచి వెళ్లవలసి ఉంటుంది లేదా మరోచోటకు వలసపోవలసి ఉంటుంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తులు అనేక సంవత్సరాలుగా భారీగా పెండింగ్‌లో ఉండటం వల్ల భారతీయ కుటుంబాల్లో ఆందోళన పెరుగుతున్నది. దీనికి కారణం వారి పిల్లల వయసు 21 దాటిపోతుండటమే. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే, దాదాపు 1 లక్ష మంది భారతీయ బాలలు గ్రీన్ కార్డ్ పొందడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ బిల్లును నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరం సమీక్షించింది.

డ్రీమర్స్, డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ (డిపెండెంట్ వీసాలపై చట్టబద్ధంగా వెళ్లి, అమెరికాలో పెరిగి, పెద్దవారై, వయసు 21 నిండటంతో లీగల్ స్టేటస్‌ను కోల్పోయినవారు) కోసం ఎనిమిదేళ్ల వరకు చెల్లుబాటయ్యే కండిషనల్ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్‌ను ఈ బిల్లు సృష్టిస్తున్నదని తెలిపింది. ఈ హోదా వల్ల ఇటువంటి వారు అమెరికా నుంచి పంపించేయకుండా రక్షణ పొందవచ్చునని, అదేవిధంగా, వర్క్ ఆథరైజేషన్ పొందడానికి అవకాశం ఉంటుందని, విదేశీ యానానికి కూడా అనుమతి వస్తుందని వివరించింది.
















