అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న భారతీయులు మూడు వారాల్లో పౌరసత్వం కూడా పొందవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఆపీ) విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ తెలిపారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందటం సులువు అని పేర్కొన్నారు. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యం లో అత్యధికంగా ఉన్న భారతీయుల ఓటు కీలకం కానున్నది. సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరిలో డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు వంటి నైపుణ్యం గల మేధావులు ఉన్నారు. గ్రీన్కార్డు ఉండి ఐదేండ్లుగా అమెరికాలో నివసిస్తున్నవారు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ సూచించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష బరిలో నిలిచిన నేపథ్యంలో భారతీయ అమెరికన్లు, ఆసియా వాసుల్లో ఆసక్తి నెలకొంది.