కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్ సహా ఆరు దక్షిణాసియా దేశాలను తన ప్రయాణ ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది. బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో 14 రోజుల ట్రావెల్ హిస్టరీ ఉన్నవారు ఈ నెల 27 నుంచి సింగపూర్ వచ్చేందుకు, లేదా సింగపూర్ మీదుగా రాకపోకలు సాగించేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే వచ్చేవారు మొదటి 10 రోజులు ఇళ్లలోనే ఉండాల్సి వస్తుందని పేర్కొంది. ఈ ఆరు దేశాల్లో కొవిడ్ పరిస్థితులు కొన్నాళ్లుగా స్థిరంగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. దీంతో పాటు పొరుగు దేశాలైన మలేషియా, ఇండోనేషియా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠిన నిబంధనలు సడలించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలను మరింత సడలించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)