17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో, అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణానం తర కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. మాట వినాలి అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను పవన్‌కల్యాణ్ స్వయంగా ఆలపించారు. కీరవాణి స్వరాల్ని అందించిన ఈ గీతాన్ని పెంచల్‌దాస్ రచించారు. వినాలి..వీరమల్లు మాట చెప్తే వినాలి అంటూ తెలంగాణ మాండలికంలో మొదలైన ఈ పాట జానపద శైలిలో సాగుతూ ఆకట్టుకుంది.
జీవితంలో ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ధర్మాన్ని పాటించాలనే సందేశంతో ఈ పాట శ్రోతల్ని మెప్పించే లా ఉంది. అటవీ నేపథ్యంలో చిత్రీకరించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. పవన్‌కల్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఆర్ట్: తోట తరణి, సమర్పణ: ఏ.ఎం.రత్నం, నిర్మాత: దయాకర్ రావు, దర్శకత్వం: క్రిష్, జ్యోతికృష్ణ.