అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఇటీవలే డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్, బహిరంగంగానే ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్, మస్క్ మధ్య నెలకొన్న వైరంపై ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ తాజాగా స్పందించారు. ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు కారణంగానే వీరి మధ్య వివాదం తలెత్తినట్లు చెప్పుకొచ్చారు. ట్రంప్ తీసుకువచ్చిన బిల్లుతో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యాడని, అందుకే అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు.

ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో మస్క్‌కు అసహనం పెరిగిపోయింది. అందుకే ట్రంప్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. కాంగ్రెస్, సెనేట్‌లో మెజారిటీ ఓట్లను పొందేందుకు అటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మస్క్‌కు తెలియదు. దీన్ని మస్క్ అర్థం చేసుకోలేకపోయారు. ట్రంప్ దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ వివాదంలో మస్క్‌పై ఆయనే గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇరువురు తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా అని ఎర్రోల్ మస్క్ పేర్కొన్నారు.
