మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌పై దాడి ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 25 ఏళ్ల రిసెప్షనిస్ట్ సోనాలి కలసార్‌పై గోకుల్ ఝా అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. అపాయింట్‌మెంట్ లేకుండా డాక్టర్ ఛాంబర్‌లోకి వెళ్లడానికి అనుమతించనందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజీలో, గోకుల్ ఝా రిసెప్షనిస్ట్‌ను కాలుతో తన్ని, ఆమె జుట్టు పట్టుకుని లాగి, నేలకేసి కొట్టడం స్పష్టంగా కనిపించింది. అక్కడే ఉన్న కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, అతను తన దాడిని కొనసాగించాడు. ఈ దాడిలో రిసెప్షనిస్ట్‌కు తీవ్ర గాయాలవడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అతడిపై పోలీసు కేసు నమోదు కాగా పలువురు ఈ ఘటనపై స్పందిస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై నటి జాన్వీ కపూర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తులు కచ్చితంగా జైలులో ఉండాలి. అసలు ఇలాంటి ప్రవర్తనను ఎవరైనా ఎలా సమర్థిస్తారు? ఎదుటి వ్యక్తిపై చేయి చేసుకోవడానికి వారికి ఎంత ధైర్యం? మానవత్వం లేకుండా ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన వారికి కనీసం పశ్చాత్తాపం, అపరాధ భావం కూడా ఉండవా? ఈ ప్రవర్తన చూశాక ఎవరైనా వారితో కలిసి ఉండాలని కోరుకుంటారా? ఇది అత్యంత అవమానకరమైన, అమానుషమైన చర్య. మనం ఇలాంటి ప్రవర్తనను ఎప్పటికీ క్షమించకూడదు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించి, నిందితుడిని కఠినంగా శిక్షించకపోతే అది మనందరికీ నిజంగా సిగ్గుచేటు. ఈ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే అన్నారు.
















