తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తుండటంతో పలు వర్గాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తాము అనుకున్నట్టే అయ్యిందని, ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే తమకు తిప్పలు తప్పవన్న తమ భయాలు నిజమయ్యాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా ఝళిపించడంతో ఎక్కడ తమపై ఆ వేటు పడుతుందేమోనని పలువురు విద్యార్థులు సైతం భయంతో వణుకుతున్నారు. భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు అక్కడ చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్నారు.
పార్ట్‌టైం ఉద్యోగాలకు సంబంధించి ఆ దేశంలో కఠిన నిబంధనలు ఉన్నా ఇంతవరకు అవి సరిగ్గా అమలు కాలేదు. అయితే ట్రంప్ అధికారం చేపట్టాక వాటిని కఠినంగా అమలు చేస్తుండటంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తాము దొరికితే ఎక్కడ డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) చేస్తారోనన్న భయంతో అమెరికాలోని పలువురు భారతీయులు వాటిని చేయడం మానేస్తున్నారు. ఉద్యోగం వద్దు బాబోయ్, ఇక్కడ ఉండనిస్తే చాలు అన్న ధోరణి వారిలో కన్పిస్తున్నది. నిబంధనల ప్రకారం తగిన పత్రాలు లేనివారు, నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నవారు, గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నవారిలోనే ఈ భయం ఎక్కువగా ఉంటున్నది.