
అమెరికా కనుక తమపై దాడి చేస్తే అందుకు ప్రతిగా టెల్ అవీవ్‌పై విరుచుకుపడతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా ఇరాన్ అధిపతి అలీ ఖమేనీ సలహాదారుడు, జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీషంఖనీ మాట్లాడారు. దాడి పరిమితంగా ఉంటుందన్నది ఊహాగానమే. అమెరికా నుంచి కానీ, ఎవరి నుంచైనా కానీ, ఏ స్థాయిలో అయినా కానీ సైనిక చర్య జరిగితే యుద్ధం మొదలైందని భావిస్తాం. తక్షణమే స్పందిస్తాం. అది సమగ్రంగా ఉంటుంది. ముందు వెనుకలు ఉండవు. దురాక్రమణ దారుడే లక్ష్యంగా ఉంటుంది. టెల్ అవీవ్ పైన, దాని మద్దతుదారుల పైన విరుచుకు పడతాం అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా దళాలు ఏ క్షణాన అయినా దాడి చేయవచ్చునని వార్తలు వస్తున్న నేపథ్యంలో షంఖనీ ఈ హెచ్చరికలు చేశారు.















