సామాన్యులు, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రకటించి, న్యూయార్క్ ప్రజల మద్దతు పొందుతున్న జోహ్రాన్ మందానిపై మరోసారి డోనాల్డ్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. ఈ ఏడాది నవంబరులో న్యూయార్క్ మేయర్ పదవికి జరిగే ఎన్నికలలో డెమొక్రటిక్ – సోషలిస్ట్ అభ్యర్ధి మాందానీ విజయం సాధిస్తే ఆ నగర పాలనను ఫెడరల్ ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. న్యూయార్క్ సిటీలో, వాషింగ్టన్ డీసీలో స్థానిక నాయకత్వాలు తన ప్రభుత్వ అజెండాకు కట్టుబడి ఉండని పక్షంలో వాటిని ఫెడరల్ ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు నగరాలూ డెమొక్రాట్ల అధీనంలో ఉన్నాయి.

శ్వేతసౌధంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తూ న్యూయార్క్ నగరాన్ని పాలించేందుకు ఓ కమ్యూనిస్టు ఎన్నికైతే అది ఎన్నటికీ ఒకేలా ఉండబోదు అని మాందానీని ఉద్దేశిస్తూ చెప్పారు. అవసరమైనప్పుడు ఆయా ప్రదేశాలను పరిపాలించడానికి శ్వేతసౌధంలో తమకు కావాల్సినంత బలముందని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పదవికి జరగబోతున్న ఎన్నికలలో ప్రత్యర్థులైన ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో కంటే మాందానీ ముందంజలో ఉన్నారు. దీంతో మాందానీపై ట్రంప్ పదేపదే దాడి చేస్తున్నారు. ఆయన ఒక విపత్తు అంటూ ఆరోపించారు. ఆయన డెమొక్రాట్ల నామినేషన్ పొందారని, వారు ఏ వైపు వెళుతున్నారో ఇది సూచిస్తోందని విమర్శించారు. బిలియనీర్ వ్యాపారవేత్త జాన్ కాట్సిమాటిడిస్‌కు చెందిన కిరాణా దుకాణాలను హస్తగతం చేసుకునేందుకు మాందానీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. న్యూయార్క్‌ను పాలించే సామర్ధ్యం ఆయనకు లేదని ట్రంప్ అన్నారు.
















