అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేయనుండగా, దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని యావత్ భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్ స్క్వేర్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనుండడం విశేషం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ వేడుకను వివిధ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లోనూ ప్రసారం చేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తుండగా, ఈ సందర్భంగా అనుసరించాల్సిన ఆచారాలు, నియమాలపై సవివరంగా తెలుసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.














