భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చే దేశాల జాబితాలో తాజాగా ఇరాన్ వచ్చి చేరింది. భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. వీసా అవసరం లేకుండానే భారతీయులు తమ దేశానికి రావొచ్చని వెల్లడించింది. ఈ మేరకు వీసా కలిగి ఉండాలన్న నిబంధనలను ఈ నెల 4 నుంచి ఎత్తి వేస్తున్న ట్లు ప్రకటించింది. సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్టు తెలిపింది. అయితే కొన్ని షరతులు పెట్టింది.
భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశంలో 15 రోజుల పాటు ఉండొచ్చని తెలిపింది. విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ వీసా ఫ్రీ ఎంట్రీ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది. కేవలం పర్యాటకం కోసం వచ్చినవారికి మాత్రమే వీసా ఎత్తివేత అమలవుతుందని తెలిపింది. ఆరు నెలలకోసారి మాత్రమే ఈ వీసా రహిత టూర్‌లకు అనుమతిస్తామని పేర్కొంది.