ఇరాన్ పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ అన్నంత పనీ చేసింది. టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు రాకపోకలు సాగించే అన్ని విమానాలను రద్దు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి జాఫర్ యాజర్లౌ వెల్లడించారు. అన్ని మార్గాల్లోని విమానాలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.