హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను హతమార్చిన నేపథ్యంలో గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలను వదులుకొని, బందీలను విడిచి పెట్టేందుకు హమాస్ అంగీకరిస్తే రేపే యుద్ధం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. యాహ్యా సిన్వర్ మరణించాడు. రఫాలో ధైర్యవంతులైన ఇజ్రాయెల్ సైనికులు ఆయనను చంపేశారు. అయితే, ఇది గాజాలో యుద్ధానికి ముగింపు మాత్రం కాదు. యుద్ధం ముగిసే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. హమాస్ ఆయుధాలను, బందీలను విడిచిపెడితే రేపే యుద్ధం ముగుస్తుంది. గాజా ప్రజలకు ఇది నా స్పష్టమైన సందేశం అని నెతన్యాహూ పేర్కొన్నారు.