ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఫ్రాంచైజీ ని కొనసాగిస్తూ యానిమేషన్ వెర్షన్‌లో రూపొందిన సిరీస్ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. జీవన్ జె. కాంగ్, నవీన్‌జాన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్. రాజమౌళి, శరత్ దేవరాజన్, శోబు యార్లగడ్డ నిర్మాతలు. ఈ సిరీస్ ఈ నెల 17 నుండి డిస్నీ, హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేకస్థానం ఉంది. ఇప్పుడు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రూపొందించి, కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించినందుకు చాలా ఆనందిస్తున్నాను అన్నారు. హాలీవుడ్‌లో ఒక సినిమా హిట్ అయితే ఆ బ్రాండ్ అనేక మీడియమ్స్‌లో ముందుకు వెళుతుంది.
బాహుబలి నిర్మాణ సమయంలో ఆ ఆలోచన నాకూ వచ్చింది. కానీ సాధ్యం కాలేదు. అయితే మనసులో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. దానికి కార్యరూపమే ఈ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. శరత్ దేవరాజ్ ఈ కొనసాగింపును అద్భుతంగా ఆవిష్కరింపజేశారు. పాత్రల ఎమోషన్ చెడకుండా హత్తుకునేలా రూపొందిం చారు. ఈ సిరీస్ కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది అని చెప్పారు రాజమౌళి. ఈ సిరీస్ క్రియేటర్, రచయిత, మేకర్ శరత్‌దేవరాజన్‌తోపాటు బాహుబలి పాత్రకు గాత్రదానం చేసిన నటుడు శరద్ కేల్కర్ కూడా మాట్లాడారు.