భారత్- చైనా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడారు. అదే విధంగా చైనా ప్రధాని లి కియాంగ్ , భారత ప్రధాని మోడీ అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏనుగుడ్రాగన్‌లా అభివృద్ధి చెందాలన్నారు.

కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాల్లో సంప్రదింపులు, సమన్వయాన్ని మరింతగా పెంచుకునేందుకు , సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని సంయుక్తంగా కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రాచీన నాగరికతా సంస్కృతి కలిగిన రెండు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యులైన ఇరు దేశాలు ఆధునికీకరణలో కీలకమైన దశలో ఉన్నాయని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు.
