యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ పరాజయం పాలయింది. దీంతో 14 ఏండ్ల ఆ పార్టీ పాలనకు తెరపడింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లతో కూడిన యూకేలో పోలింగ్ జరుగ్గా, ఫలితాలు వెల్లడయ్యాయి. 650 మంది సభ్యులు ఉండే హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ 412 స్థానాలను కైవసం చేసుకుంది. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. లిబరల్ డెమోక్రాట్లు 71 స్థానాల్లో విజయం సాధించగా, మిగతా పలు పార్టీలు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. లేబర్ పార్టీ 33.7 శాతం ఓట్లను సాధించగా, కన్జర్వేటివ్ పార్టీ 23.7% ఓట్ షేర్ దక్కించుకొన్నది.