అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ అడ్మిషన్లలో ఎన్నారై కోటా పరిధిని విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయంపై పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ మోసానికి ముగింపు పలకాల్సిందేనని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 15 శాతం కోటా కింద ఎన్నారైల దూరపు బంధువులైన అత్త, మామ, బామ్మ, తాత, కజిన్స్ వంటి వారిని చేర్చుకునేందుకు ఎన్నారై కోటాను విస్తరిస్తూ ఆగస్టు 20న పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 10న ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మంగళవారం దీనిని విచారించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. మోసానికి ముగింపు పలకాల్సిందేనని, దీనివల్ల మూడు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చిన వారు అడ్మిషన్ కోల్పోతారని పేర్కొంది.