తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎపిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతోంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాలైన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాల బరిలో 525 మంది అభ్యర్థులు ఉండగా, కంటోన్మెంట్ అసెంబ్లీలో బరిలో 15 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 169 నియోజక వర్గాలలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అరకు, పాడేరు, రంపచోడవరం సాయంత్రం నాలుగు గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజక వర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఉదయాన్నే ఓటర్లుక్యూ కట్టారు.