గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం చెందాడు. సౌదీ అరేబియా ఎడారిలో తప్పిపోయిన అతను ఎటు వెళ్లాలో తెలియక, తాగేందుకు గుక్కనీరు లేక, ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించి దయనీయ స్థితిలో చనిపోయాడు.కరీంనగర్‌కు చెందిన షహబాజ్ ఖాన్ (27) బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అల్ హాసా ప్రాంతంలోని ఒక టెలికం కంపెనీలో టవర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్ సక్రమంగా పనిచేయలేదు. జీపీఎస్ పనిచేయకపోవ డంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా రుబా అల్ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్ అయిపోయిం ది. తాము దారితప్పామనే విషయం మేనేజ్‌మెంట్‌కు చెబుదామంటే ఇద్దరి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అయ్యాయి.
నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న రుబా అల్ ఖలీ ఎడారిని అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా చెబుతుంటారు. ఇక్కడ మనుషులు, ఒంటెలు ఏవీ ఉండవు. దీంతో దారితప్పిన వాళ్లకు సాయం చేయడానికి కూడా ఎవరూ కనిపించలేదు. దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్ ఖాన్, అతని సహచరుడు అనుకున్నప్పటికీ ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు. సర్వీస్ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు. వారి మరణవార్తను కుటుంబసభ్యులకు చెప్పారు. కాగా, షహబాద్ మరణవార్త తెలుసుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గల్ఫ్ కూటమిలో అతి పెద్ద దేశమైన సౌదీ భూభాగంలో సగానికి పైగా ఎడారులు ఉన్నాయి. ఇక్కడి ఎడారు లలో దారి తప్పి మరణించడం సాధారణంగా జరుగుతుంటుంది. గతంలో కూడా కొందరు తెలుగు ప్రవాసీ యులు ఈ రకమైన దయనీయ పరిస్థితులలో మరణించారు. చాలా సందర్భాల్లో కేవలం మృతుల అస్థిపంజరాలే లభిస్తాయి.