హీరో మంచు విష్ణు తనయుడు మంచు అవ్రామ్ కన్నప్ప చిత్రం ద్వారా వెండితెరపై అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ్రామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు విడుదల చేశారు. ఈ సినిమాలో తిన్నడు బాల్యానికి సంబంధించిన పాత్రలో అవ్రామ్ కనిపించబోతు న్నాడు. కాళీమాత విగ్రహం బ్యాక్‌డ్రాప్‌లో ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.
మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శివుడి అపరభక్తుడైన కన్నప్ప జీవితగాథ ఆధారంగా భక్తిరసప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్, మంచు మోహన్‌బాబు, ప్రభాస్, అక్షయ్‌కుమార్, శివరాజ్‌కుమార్ వంటి అగ్ర తారలు భాగమయ్యారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.