రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు 60 మంది మృతిచెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్‌నిక్ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకున్నది. మృతు ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్ ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.
తొలుత కన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన దుండగులు అక్కడున్నవారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. మ్యూజిక్ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఏం జరుగుతుందో తెలియక అక్కన్నవారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హాలులో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడికి పాల్పడినవారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తున్నది.