యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్ధిల్లుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. బోచాసన్వాసీ శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఈ దేవాలయాన్ని నిర్మించింది. ఇది అబుదాబిలో తొలి రాతి హిందూ దేవాలయం కావడం విశేషం.
![](https://namastenri.net/wp-content/uploads/2024/02/ggt-1024x856.jpg)
భారత్, అరబ్ దేశాలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించాయి. హిందూ మతంలోని వైష్ణవుడైన స్వామి నారాయణ సంప్రదాయానికి చెందిన బోచసన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ (బీఏపీఎస్) ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిలో 13.5 ఎకరాల భూమిని ముస్లిం రాజు అయిన షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయానికి వాస్తు శిల్పిగా క్యాథలిక్ క్రిస్టియన్, ప్రాజెక్ట్ మేనేజర్‌గా సిక్కు మతస్థుడు ఉన్నారు. ఫౌండేషన్ డిజైనర్ బుద్దిస్ట్ కాగా, నిర్మాణ సంస్థ పార్సీలకు చెందినది. డైరెక్టర్ జైన మతానికి చెందిన వ్యక్తి అని బీఏపీఎస్ ప్రతినిధి వెల్లడించారు.