అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తున్న సినిమా పాప్ కార్న్. ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. లిఫ్టులో పిక్చరైజ్ చేసిన పాట ఆకట్టుకుంది. హీరో సాయి రోనక్‌కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.ఆ సీరియల్ 128 దేశాల్లో అనువాదమైంది. ఆమె ఈ సినిమాతో నిర్మాతగా మారింది. కొత్త తరహా చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఎంఎస్ చలపతి రాజు మాట్లాడుతూ ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు. స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. పెద్దవాళ్లు సినిమా చూస్తూ తమ గతానికి వెళతారు. యువత సినిమాను ఆస్వాదిస్తారు అన్నారు. నాయిక అవికాగోర్ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించి, నిర్మించడం గర్వంగా ఉంది. కొత్త కాన్సెప్ట్ మూవీ. సాంకేతికంగా సవాలు లాంటి చిత్రమిది. మీ అందరికీ నచ్చుతుంది అన్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకానుంది.