నరేంద్ర మోదీ రేపు సాయంత్రం ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడంతో, ఎన్డీఏ ఎంపీలంతా కలిసి మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దాంతో ఆయన మూడోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమ య్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న తొలి వ్యక్తిగా నరేంద్రమోదీ గుర్తింపు పొందారు. ప్రమాణస్వీకారం నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ పరసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఇప్పటికే 2014, 2019ల్లో ఆయన రెండు పర్యాయాలు ప్రధానిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా భద్రతా కారణాల రీత్యా ఢిల్లీని నో ఫ్లై జోన్‌గా కూడా ప్రకటించారు. డ్రోన్‌లు, పారా గ్లైడర్‌లు, ఎయిర్ బెలూన్స్ లాంటివి ఎగుర వేయకుండా నిషేధం విధించారు. కాగా మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీచెల్లెస్, మాల్దీవ్స్ తదితర దేశాల అధినేతలు హాజరుకానున్నారు.