ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ సాహిత్య వేదిక నెల నెలా తెలుగువెన్నెల 220 వ సాహిత్య సదస్సు 2025 డాలస్ టెక్సాస్‌లోని సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. మహాకవి వాక్పతిరాజు – సాహితీ విహంగ వీక్షణం అంశం పై ముఖ్య అతిథి శ్రీ పరిమి శ్రీరామనాథ్ ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది. చిరంజీవి సమన్విత వీనులవిందుగా ఆలపించిన ప్రార్థనా గీతంతో సదస్సు ప్రారంభమైంది. సంస్థ సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలికారు. సాహిత్య వేదిక గత 18 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని తెలిపారు. అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని చెప్పారు.

రెండేళ్లుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తినివ్వడమే కాక, ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఈ నెలలో స్వర్గస్తులైన ప్రముఖ ప్రజా కవి అందెశ్రీ, సంస్థ శ్రేయోభిలాషి స్థానిక వ్యాపారవేత్త అవర్ ప్లేస్ బాబుకు నివాళిగా నిమిషం పాటు అంతా మౌనం పాటించారు. ముఖ్య అతిథి తన ప్రసంగంలో రసజ్ఞత యొక్క ఆవశ్యకతను, తైత్తరీయ ఉపనిషత్తులో ప్రస్తావించిన 22 ఆనందాల వివరాలతో చక్కగా విశదపరిచారు. అలాగే కావ్య పఠన అవసరాన్ని, అది హృదయాన్ని ఎలా కదిలిస్తుందో వివరిస్తూ భవభూతి సమకాలీనుడు యశోవర్మ ఆస్థాన కవి అయిన మహాకవి వాక్పతి రాజు జీవన యానాన్ని, వారి సాహితీ వైభవాన్ని సోదాహరణంగా వివరించారు.

సాహితీప్రియులందరినీ భాగస్వాములను చేస్తూ గత 90 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి ధారావాహిక మనతెలుగుసిరిసంపదలు”అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున దయాకర్ మాడ, ముఖ్య అతిథికి సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా సన్మానించారు. వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్థికంగా తోడ్పడుతున్న దాతలతో పాటూ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
















