హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఔషధనగరి ( ఫార్మాసిటీ) స్థానంలో పర్యావరణహిత నగరం (గ్రీన్ సిటీ) ఏర్పాటుకానుంది. సీఎం ఆదేశాలతో సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఔషధాల తయారీలో బహుళజాతి సంస్థల అవసరాలు, కొత్త ఫార్మా కంపెనీల అవసరాల దృష్ట్యా రంగారెడ్డి జిల్లా పరిధి కందుకూరు, యాచారం మండలాల్లో ఔషధనగరిని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో ఫార్మాసిటీని విస్తరించే క్రమంలో ఆ రెండు మండలాల్లో 19 వేల ఎకరాలను సేకరించింది. తొలి దశలో ప్రభుత్వ భూములు, లావణిపట్టాలు, ఇతరాలు కలిపి 6,400 ఎకరాలు, రెండో దశలో ఎసైన్డ్ సహా రైతుల నుంచి మరో 12 వేల ఎకరాలను అందుబాటులోకి తెచ్చింది.
ఔషధనగరి భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ సమీక్షించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఏర్పాటు వల్ల పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని, దాన్ని నగరానికి దూరంగా నెలకొల్పాలని ప్రతిపాదించారు. ఇప్పటికే సేకరించిన భూముల్లో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులు త్వరలో సమావేశమై వాటిని సమీక్షించనున్నారు. గత ప్రభుత్వం ఏడేళ్ల క్రితం ఔషధనగరిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించగానే కందుకూరు, యాచారం మండలాల్లో బాహ్మ వలయ రహదారికి సమీపంలో భారీగా స్థిరాస్థి వెంచర్లు వెలిశాయి. భూముల ధరలూ పెరిగాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు మెగా టౌన్‌షిప్ ఏర్పాటుకు అడుగులు పడితే ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని స్థిరాస్థి వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యాచారం మండలంలోని కుర్మిగడ్డ, మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాలకు చెందిన రైతులు ఈ భూసేకరణను వ్యతిరేకించారు. పరిహారం తక్కువగా ఇస్తున్నారంటూ ఆందోళనలకు దిగడంతో పాటు కోర్టులను ఆశ్రయించారు. మొత్తం 32 ఫిర్యాదులకు సంబంధించి వివిధ కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారించిన హైకోర్టు భూసేకరణ చట్ట ప్రకారం జరగలేదంటూ నాలుగు నెలల క్రితం తీర్పునిచ్చింది. భూసేకరణ ప్రక్రియను రద్దు చేసింది. ఔషధనగరికి భూములు అవసరమయ్యే పక్షంలో చట్టప్రకారం మూడు నెలలలోపు మళ్లీ సేకరించుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.