యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పాకిస్థాన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరుదేశాలు కొన్ని షరతుల (అమెరికా -15, ఇరాన్ – 10)కు పట్టుపట్టిన కారణంగా అనుకున్న సమయం కంటే ఐదు గంటలు ఆలస్యంగా ఇస్లామాబాద్‌లో దౌత్యపరమైన చర్చలు మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి రెండు వారాలు విరామం ప్రకటించిన ఇరాన్, అమెరికా శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు దౌత్యపరమైన చర్చల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల ప్రతినిధులు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకున్నప్పటికీ ఐదు గంటలు ఆసల్యంగా మొదలయ్యాయి. ఇరాన్‌తో అధికారికంగా చర్చలు మొదలయ్యాయి అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఎలా జరుగుతాయో నాకు తెలియదు. అయితే, ఇరాన్ విశ్వసనీయతను నేను తక్కువ సమయంలోనే గ్రహించగలను. హర్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకోనుంది. అంతేకాదు చమురు రవాణా కోసం ప్రత్యామ్నాయ మార్గాల అవసరం ఉంది. ఇరాన్ ఒక విఫల దేశం. ఒకవేళ దౌత్యపరమైన చర్చలు విఫలమైతే యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఈసారి మరింత తీవ్రంగా దాడులకు తెగబడుతాం అని ట్రంప్ బదులిచ్చారు.















