గతేడాది నవంబర్‌లో మాల్దీవుల దేశాధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్ వ్యతిరేక వాణి వినిపించిన మహ్మద్ మొయిజ్జు స్వరం మార్చారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత మిత్రపక్షంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. తమ దేశానికి ఉన్న రుణ భారం నుంచి రిలీఫ్ కల్పించాలని భారత్‌ను కోరారు. గతేడాది చివరి వరకూ భారత్‌కు మాల్దీవుల 400.9 మిలియన్ డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే చైనా అనుకూల వాదనలు వినిపించిన మహ్మద్ మొయిజ్జు, మే 10 నాటికి భారత్ సైన్యం తమ దేశాన్ని వీడాలని డిమాండ్ చేశారు. భారత్‌ను మహ్మద్ మొయిజ్జు ప్రశంసల్లో ముంచెత్తారు. మాల్దీవులలో భారత్ పలు ప్రాజెక్టులు చేపట్టిందని పేర్కొన్నారు.
మాల్దీవులకు భారత్ అత్యంత సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందనడంలో సందేహం లేదని మొయిజ్జు చెప్పారు. ఈ నెలాఖరులో భారత సైనిక బలగాల తొలి బ్యాచ్ మాల్దీవులను వీడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మొయిజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.